రోహిత్ వేముల చట్టంపై కేబినెట్ సబ్ కమిటీ.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

  • రోహిత్ వేముల చట్టం రూపకల్పనపై కేబినెట్ సబ్ కమిటీ
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో కమిటీ ఏర్పాటు
  • ఉన్నత విద్యాసంస్థల్లో వివక్ష నివారణే లక్ష్యంగా బిల్లు
  • కమిటీలో మంత్రులు ఉత్తమ్, దామోదర, శ్రీధర్ బాబు, పొన్నం
తెలంగాణలోని ఉన్నత విద్యాసంస్థల్లో సామాజిక గుర్తింపు ఆధారిత వివక్షను నిరోధించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై "రోహిత్ వేముల తెలంగాణ (ఉన్నత విద్యలో గుర్తింపు ఆధారిత వివక్ష నివారణ) బిల్లు, 2026" రూపకల్పన కోసం ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మల్లు ఈ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఇందులో సభ్యులుగా ఉంటారు. ఈ బిల్లుపై అధ్యయనం చేసి, చట్ట రూపకల్పనకు అవసరమైన సిఫార్సులు, సూచనలను సబ్ కమిటీ ప్రభుత్వానికి అందిస్తుంది.

షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరిస్తారని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు జీవో ఆర్టీ నెం.490ని జారీ చేశారు. వీలైనంత త్వరగా తమ నివేదికను సమర్పించాలని కేబినెట్ సబ్ కమిటీని ఆదేశించారు.

Rohit Vemula
Rohit Vemula Act
Telangana
Bhatti Vikramarka Mallu
Higher Education
Social Discrimination
Cabinet Sub Committee
Telangana Government
SC Development

More Telugu News